
కామన్వెల్త్ గేమ్స్‌లో హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో సైనా 19-21, 23-21, 21-13 తేడాతో మలేషియాకు చెందిన వాంగ్ పై విజయం సాధించింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌కు అనుకున్నంత సులభంగా గోల్డ్‌మెడల్ దక్కలేదు.
ప్రత్యర్థి మలేషియాకు చెందిన వాంగ్ గట్టిపోటీనిచ్చింది. ఎవరూ ఊహించని విధంగా తొలి సెట్ గెలుచుకుంది. ఈ సెట్ వాంగ్ గెలుచుకుందనడం కంటే సైనా ఒత్తిడికి లోనై అనవసర తప్పిదాలతో వెనుకబడిందని చెప్పాలి. అయితే రెండో సెట్‌లో మాత్రం సైనా అద్భుతంగా పుంజుకుంది. తనదైన ఆటతీరుతో ప్రత్యర్థిపై ఆధిక్యంలో కొనసాగింది. సెట్ చివర్లో వాంగ్ పోటీ ఇచ్చినప్పటికీ చివరకి సైనాదే పై చేయిగా నిలచింది. ఇద్దరూ చెరో సెట్ గెలవడంతో మూడో సెట్ కీలకంగా మారింది.
మొదటి రెండు సెట్లలోనూ కాస్త ఒత్తిడికి లోనైన సైనా చివరి సెట్‌లో మాత్రం కాన్ఫిడెన్స్‌తో ఆడింది. దీంతో చివరి వరకూ ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించి మ్యాచ్ కైవసం చేసుకుంది. దీంతో కామన్‌వెల్త్‌గేమ్స్ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం నెగ్గిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. మ్యాచ్ ఆడుతున్నప్పుడు కొంచెం ఒత్తిడికి లోనైన కారణంగానే వెనుకబడినట్లు ఈ హైదరాబాదీ షట్లర్ చెప్పింది. సైనా గెలిచిన స్వర్ణంతో పతకాల పట్టికలో భారత్ రెండో స్థానానికి ఎగబాకింది.
No comments:
Post a Comment